ఇంట్లో పార్టీలు చేసుకుంటే దాడులు చేస్తారా?

ఇంట్లో పార్టీలు చేసుకుంటే దాడులు చేస్తారా?
  • ​​మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  ఇంట్లో పార్టీ చేసుకుంటే దాడులు చేస్తరా? అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో దావత్ లకు పర్మిషన్లు తీసుకోవాలా అని మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టలేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ సెక్యూరిటీలో ఇప్పుడు స్పెషల్ పోలీసులను తీసివేశారని, రేపు ఆర్మ్డ్ పోలీసులు తిరగబడితే ఏం చేస్తారని, చంద్రబాబుతో మాట్లాడి ఆంధ్రా పోలీసులను తెచ్చుకుంటారా అని ప్రశ్నించారు.

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: కౌశిక్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తూ, తనను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందకు ప్రయత్నాలు చేశారన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంగళవారం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తను ప్రైవేట్ ఫంక్షన్​కు వెళ్తే పోలీసులు వచ్చేవారని, తన కారును చెక్ చేసేవారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే రాజ్ పాకాల ఇంట్లో డ్రగ్స్ పెట్టి, ఈ కార్యక్రమానికి కేటీఆర్ వస్తే ఇరికించాలని చూశారని ఆరోపించారు. డ్రగ్స్ టెస్టుకు తాము సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.